* లోక్ సభ రేపటికి వాయిదా ... రాజ్యసభ 3గంటలకు వాయిదా ...
* ఆందోళనల నేపధ్యంలో కేంద్రం కీలక ప్రకటన ...
* నీట్ పేపర్ లీక్ పై చర్చకు సిద్దమన్న కేంద్రం ....
* ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చకు అంగీకరిస్తామన్న విపక్షాలు ...
Delhi :
నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్ ఉభయ సభలు మూడవ రోజు అట్టుడుకుతున్నాయి. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో సభలు నినాదాలతో మార్మోగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం.. పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కొనసాగిస్తుండగా.. లోక్ సభ రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు. దీంతో రెండు సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ ఏకంగా రేపటికి వాయిదా పడగా, రాజ్యసభ మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ ఘటనపై స్పందిస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. లోక్ సభలో పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. ప్రతిపక్షం చర్చ కోరితే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనను 'ఘోర పాపం'గా అభివర్ణించారని పేర్కొంది.
కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అయన రాజీనామా తరువాతే చర్చ నిర్వహించాలని, నీట్ లీక్ ఘటనపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
గతంలో నీట్ పరీక్షలో లీకులు చోటు చేసుకున్న సమయంలోనే విపక్ష నేత రాహుల్ గాంధీ దీనిపై పార్లమెంట్ లో చర్చించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్దులు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ అదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. పార్లమెంట్ లో నీట్ పై సమగ్ర చర్చకు సిద్దంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విపక్షాలకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సభలు వాయిదా అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండియా కూటమికి చెందిన పలువురు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో భారీ ప్రదర్శన చేపట్టారు. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వరుసగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీల వంటి ఉదంతాలు.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటంలో విఫలమైన ఆయనకు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని తేల్చి చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి లోకం మొత్తం గళం విప్పిందని, దీన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. ఇంన్ని లక్షలమంది డిమాండ్ చేస్తోన్న గానీ రాజీనామా చేయకపోవడం సరికాదని అన్నారు.
ఎంపీలు పవన్ ఖేరా, ఎంపీ మల్లు రవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అత్యంత విచారకరమని అన్నారు. విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఖండిస్తోన్నామని, దీనికి నిదర్శనంగానే విపక్ష సభ్యులందరూ కూడా నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌కు వచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ గళాన్ని బలంగా వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కానీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్నా....ఈ డిమాండ్ రాజకీయ ప్రేరేప్రితమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు నీట్ పేపర్ లీక్ జరిగినట్లు తెలిసిన వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యతగా రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకున్నారని ఏన్డీయే వర్గాలు చెప్తున్నాయి. నీట్ లీకులపై సీబీఐ విచారణకు ఆదేశించడం, పరీక్ష రద్దు, తిరిగి నిర్వహించడం కూడా అందులో భాగమని కేంద్రం వాదిస్తోంది. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం కానీ, ప్రధాని మోడీ కానీ సిద్దంగా లేరన్న విషయం అర్ధమవుతోంది. మరి విపక్షాలు చర్చలో పాల్గొంటాయా లేక ఇదే ఆందోళనలను కొనసాగిస్తాయా వేచి చూడాలి.