* బద్వేలులో మాజీ మంత్రి వీరారెడ్డి కుటుంబానికి టిడిపి స్వస్తి ...
* టిడిపి ఇన్ చార్జిగా సూర్యనారాయణరెడ్డిని నియమించిన అదిష్టానం...
* కనీసం పిలిచి మాట్లాడకుండానే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబాన్ని పక్కన పెట్టిన అధిష్టానం ...
BADVEL TDP INCHARGE :
కడప జిల్లాలో ఒకప్పటి టిడిపి కంచుకోట బద్వేలు. ఈ కంచుకోటకు కేరాఫ్ అడ్రస్ మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి. ఇప్పుడు నియోజకవర్గంలో మారిన పరిణామాల నేపధ్యంలో ఆ కంచుకోటకే బీటలు వారాయి. 60 యేళ్లుగా అంటిపెట్టుకున్న పార్టీ ఇప్పుడు ఆ కుటుంబానికి బదులుగా మరో కొత్త సారధిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. కొత్త సారధిని నియమించినా సరే... కనీసం ఆ కుటుంబాన్ని పిలిచి మాట్లాడకుండానే స్వస్తి పలకడమే కొసమెరుపు. దీంతో 60 యేళ్లుగా బద్వేలులో రాజకీయం నడిపిన ఆ కుటుంబానికి బ్రేక్ పడింది.
కడప జిల్లా బద్వేలులో టీడీపీ ఆవిర్భావం నుంచి టిడిపి కి కంచుకోటగా ఆ నియోజకవర్గంలో గత రెండు దశాబ్దాలుగా పార్టీ ఉనికి కోసం పోరాడుతుంది.. జిల్లాలో రాజకీయ ఉద్ధంతుడిగా చక్రం తిప్పిన బిజివేముల వీరారెడ్డి దివంగతులు అయ్యాక నేటికీ ఆ కుటుంబ సభ్యులే ఆ నియోజకవర్గం ఇన్చార్జ్ గా ఉన్నా గెలుపు ముంగిట ప్రతిసారీ బోల్తా పడుతున్నారు. దాంతో ఇంతకాలం పార్టీ ఇన్చార్డ్ ఉండి పార్టీకి చేసిందేంటి, కొత్త వ్యక్తులకు నియోజకవర్గం ఇన్చార్జ్ కి భాద్యతలు అప్పగించాలని అధిష్టానం గత కొంత కాలంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అది ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చు రాజేసింది. అయినా అధిష్టానం వెనక్కి తగ్గకుండా ఇన్ చార్జిని మార్చేందుకు అడుగుముందుకు వేసింది.
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న బద్వేల్ :
కడప జిల్లా బద్వేల్ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కంచుకోట.. బద్వేల్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పనిచేసిన ఘనత బిజివేముల వీరారెడ్డిది. బద్వేలు నియోజకవర్గాన్ని తను కంచుకోటగా మార్చుకొని బద్వేల్ వీరారెడ్డిగా పేరు గడించారు. వీరారెడ్డి బద్వేలులో గెలుపొందిన జిల్లా రాజకీయాలను సైతం శాసిస్తూ వచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీలో అయన చెప్పిందే వేదంగా సాగింది. కానీ వీరారెడ్డి మరణం తర్వాత వారసత్వంగా రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన ఆయన కుమార్తె విజయమ్మ 2001 లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించినా ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గోవిందరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అటు తరువాత అమె నియోజకవర్గంలో స్థానికంగా పెద్దగా ఉండకపోవడంతో కార్యకర్తలు కూడా కొంత న్యాయతక్వ సమస్యను ఎదుర్కొవల్సి వచ్చిందన్న విమర్శలు లేకపోలేదు.
విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డికి టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు :
2009 నుంచి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి తెలుగుదేశం దేశం పార్టీ కష్టాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా ఇన్చార్జ్ మాత్రం విజయమ్మనే కొనసాగుతున్నారు. ఇటీవల 2024 ఎన్నికల ముందు నుంచి విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి ఇన్చార్డ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ టీడీపీలో కొంత కొత్త మార్పులే కనిపించినా...అయనపై పెట్టుకున్న ఆశల మేరకు పనిచెయ్యలేకపోయారని కార్యకర్తలు, అధిష్టానం భావిస్తూ వచ్చారు.
పార్టీ నుంచి బిజివేముల కుటుంభానికి కరువైన ప్రోత్సాహం .. :
రాష్ర్టంలో చాలా నియోజకవర్గాల్లో టిడిపి ఓడినా... ఆ నియోజకవర్గ ఇన్ చార్జులకు ఎమ్మెల్సీ లేదా మరో నామినేటెడ్ పదవినో అధిష్టానం ఇస్తూ వస్తుంది. ఇక రిజర్వుడు నియోజకవర్గాల్లో అయితే ... ఆ నియోజకవర్గ ఇన్ చార్జులకు ఎమ్మెల్సీ పదవి అప్పగించడం జరిగేది. కానీ బద్వేలులో మాత్రం 2004లో విజయమ్మ ఓటమి అనంతరం .. ఆ కుటుంబాన్ని ఎలాంటి పదవులు వరించలేదు. కనీసం నియోజకవర్గంలో పార్టీని కాపాడుకునేందుకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు లేకపోలేదు. వాస్తవానికి వైఎస్ కుటుంబ హావా ఎక్కువగా కనిపించే కడప జిల్లాలో... జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికలు జరిగితే... ఏ నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపిపి లాంటి పదవులు గెలవకపోయినా...బద్వేలులో మాత్రం జడ్పీటీసీ స్థానాల్లో టిడిపి గెలుపొందుతూ వచ్చేది. కానీ పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటున్న బిజివేముల కుటుంబాన్ని కాపాడుకునేందుకు మాత్రం ఒక్క నియోజకవర్గ ఇన్ చార్జి పదవి మినహా మరే ఇతర పదవులు ఇవ్వలేదు. దీంతో పార్టీ నుంచి బిజివేముల కుటుంబానికి ప్రోత్సాహం కరువైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గంలో ఓటములు... :
బద్వేలు ఎస్సీ నియోజకవర్గంగా మారిన అనంతరం ఇక్కడ వరుస ఓటములు తప్పలేదు. కానీ గడచిన ఎన్నికల్లో టిడిపి ఓటమికి మాత్రం తప్పక పార్టీ తీసుకున్న తప్పద నిర్ణయమే కారణమన్నది నియోజకవర్గంలో మోజార్టీ వర్గాల అభిప్రాయం. 2024 ఎన్నికల్లో ఇరిగేషన్ శాఖలో డిఇగా పనిచేస్తున్న బొజ్జ రోషన్న ఉద్యోగాన్ని వదులుకునే వచ్చి పోటీ చేశారు. చాలా రోజుల పాటు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, అమ తనయుడు నియోజకవర్గ ఇన్ చార్జి రితీష్ రెడ్డిల వెంట టిడిపి అభ్యర్ధిగానే ప్రచారం కూడా చేసుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా టిడిపిదే విజయం అన్న ప్రచారం సాగింది. కానీ టిడిపి జనసేన, బిజేపితో పొత్తు పెట్టుకోవడం.. అన్యూహ పరిణామాల మధ్య బద్వేలు నియోజకవర్గాన్ని బిజేపి ఇవ్వడం... స్థానిక టిడిపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగాయి. ఈ వ్యతిరేకత కారణంగా అప్పటి వరకు టిడిపి అభ్యర్ధిగా ప్రచారం చేస్తున్న రోషన్నకు బిజేపి కండువా కప్పి మరి పార్టీ మార్చారు. ఎప్పడైతే బిజేపి కండువ కప్పారో... అప్పుడో బద్వేలులో మరోమారు ఓటమి తప్పదని ఎన్నికల ముందేఅందరు నిశ్చయానికి వచ్చారు. అలా బద్వేలులో తప్పుల వెనక తప్పులతో ఓటములు కోనితెచ్చుకున్నారు.
ఈ కారణాల నేపధ్యంలో వైఫల్యాలన బిజివేముల కుటుంబానికి చుట్టుకున్నాయి. ఆ కుటుంబ వైఫల్యాల వల్లే బద్వేలులో పార్టీ పుంజుకోవడం లేదన్న విమర్శలు తీవ్రమవ్వడంతో చివరకు ఇప్పుడు ఇన్ చార్జి మార్పుకు దారితీసింది. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్లే టీడీపీ అధిష్టానం కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ సేకరించింది. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న రితేష్‌రెడ్డితో పాటు..కడప డీసీసీ బ్యాంకు ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి పేరుతో అభిప్రాయ సేకరణ చేశారు. చివరకు బద్వేలులో రాజకీయంగా ఎంతో పేరున్న బిజివేముల వీరారెడ్డి కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టింది అధిష్టానం. కడప డీసీసీ బ్యాంకు ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి నూతన ఇన్ చార్జిగా నియమించింది.

కనీసం బిజివేముల కుటుంభాన్ని పిలిచి మాట్లాడకుండానే మార్పు :
బద్వేలు మార్పు తప్పదని చాలా కాలంగా బలంగానే ప్రచారం సాగుతున్నా...ఇప్పుడు జరిగిన రీతాలో జరుగుతుందని ఎవ్వరు ఉహించి ఉండరు. నియోజకవర్గంలో ఎంతో బాలమైన నేపధ్యమున్న బిజివేముల కుటుంబాన్ని కనీసం అధిష్టానం పిలిచికూడా మాట్లాడకుండానే ఇన్ చార్జిని మార్చేసింది. ఓ వైపు కడపలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి, అమె భర్త టిడిపి రీజినల్ కో అర్డినేటర్ శ్రీనివాసులరెడ్డిలు గత కొంత కాలంగా రాజ్యసభ సీటు దక్కలేదన్న కారణంగా పార్టీకి దూరంగా... తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో శ్రీనివాసులరెడ్డిని ఇన్ చార్జి మంత్రి సవిత, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డిలు వెంటబెట్టుకుని వెళ్లి అధినేత చంద్రబాబుతో మాట్లాడించారు. అలాంటిది ఇంత కాలం పాటు పార్టీ కోసం పనిచేసిన బిజివేముల కుటుంబాన్ని కనీసం ఎందుకు చర్చించి ఇన్ చార్జిని మార్చలనే ప్రయత్నం చెయ్యలేదన్నది ప్రశ్న. కానీ ఇటీవల జరిగిన పరిణామలతో బద్వేలులో వర్గపోరు నెలకోనగా...ఇప్పుడు ఈ మార్పుతో సర్దుకుంటాయా అంటే సర్దుకునే పరిస్ధితే లేదని చెప్పకతప్పదు.
మరి ఈ మార్పుపై మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితేష్‌రెడ్డిలు వెంటనే స్పందస్తారా ? లేక ఎన్నికల వరకు మౌనంగా ఉండి ... ఎన్నికల సమీపించాకా తమ ప్రతాపం చూపుతారా అన్నది వేచి చూడాలి.