• ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుతో ఉద్యమం బలోపేతం ...
• ఉద్యమంలో భాగస్వామ్యాలుగా విద్యార్థి, యువజన, రైతు విభాగాలు..
• ఇంటి ఇంటికీ కరపత్రాల ద్వారా నష్టాలను వివరణ....
• తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశంలో నిర్ణయం...

తాడేపల్లి :
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ చేపట్టిన ఉద్యమాన్ని ఇక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే సీమ ఎత్తిపోతల పథకంపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన వైసీపీ ఇప్పుడు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చెయ్యాలని నిశ్చయించింది. ఈ ఉద్యమంలో సీమ జిల్లాలతో పాటు..ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా జతవ్వడంతో ఈ ఉద్యమం మరింత ఉపందుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు.

అనంతరం కడపలో సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీ నేతలంతా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పట్ల కూటమి ప్రభుత్వ వివక్షతను ఎండగట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే 85 శాతం పనులు పూర్తి చేసిన విధానాన్ని వివరిస్తూనే ఎగువ రాష్ట్రాల నీటి వినియోగాన్ని, ఎపి ప్రభుత్వ అలసత్వాన్ని, సీమకు చేస్తున్న ద్రోహాన్ని ఎలుగెత్తి చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ రెండు చోట్ల కూడా ప్రధానంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఒత్తిడికి సీఎం చంద్రబాబు లొంగిపోయారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాకుండా రాయలసీమలో పుట్టి, ఇక్కడి నుంచే రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు, ఆ ప్రాంతానికి ద్రోహం తలపెట్టడం అంటే, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి ఆ ప్రాజెక్ట్ పై చర్చించేందుకు తాడేపల్లిలో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాడేపల్లిలో ప్రత్యేక సమావేశం :
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో- ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సజ్జల పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగిన పరిణామాలు, వాటి ప్రభావం రైతాంగంపై పడుతున్న ప్రభావం గురించి స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయా జిల్లాల నేతలు సమావేశం దృష్టికి తెచ్చిన అంశాలపై చర్చించారు.
సమావేశంలో నిర్ణయించిన కార్యాచరణ ... :
• రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై జరిగిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.
• ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడం.
• వచ్చే రెండు మూడు నెలల్లో ప్రతి వారం లేదా పది రోజులకోసారి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించడం.
• విద్యార్థి, యువజన, రైతు విభాగాలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం.
• ప్రతి ఇంటికీ కరపత్రాల ద్వారా ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల కలిగే నష్టాలను వివరించడం.
• అల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి, రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
ఈ అంశాలపై రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలు సాకే శైలజానాథ్, ఎస్‌వీ సతీష్ రెడ్డి, పి. రవీంద్రనాథ్ రెడ్డి, ఉషాశ్రీచరణ్, భూమన కరుణాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, ఆకేపాటి అమర్‌నాధ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు, రైతు విభాగం నేతలు వైయం ప్రసాద్ రెడ్డి, వి. భరత్ కుమార్ రెడ్డి, బూరుగుపల్లి సుబ్బారావు, కె. త్రినాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పుత్తా శివశంకర్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఉద్యమానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలో చర్చించడంతో.... రానున్న రోజుల్లో సీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం వివిధ వర్గాలను కలుపుకుని... పలు రకాల పోరాటాలకు సమాయత్తం అయ్యే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే రాయలసీమలో మరోసారి జల ఉద్యమం పెద్ద ఎత్తున సాగే అవకాశం వుంది. సీమ జిల్లాలకు తోడు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను ఈ ఉద్యమాన్ని వైసీపీ తీవ్ర స్దాయిలో తీసుకెళ్లడం ఖాయమని చెఫ్పక తప్పదు.