* సుప్రీం కోర్టు సంచలన తీర్పు... !
* ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సమర్ధన...
Delhi supreme court :
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారితే వారి రిజర్వేషన్ హక్కుల కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వివరణ ఇచ్చింది. ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీలకు లభించే రాజ్యాంగపరమైన లబ్ధిని, రక్షణలను పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి, గత పదేళ్లుగా పాస్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే, తనపై జరిగిన ఒక దాడికి సంబంధించి ఆయన 'ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం' కింద కేసు నమోదు చేశారు. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపి, మతం మారిన వ్యక్తికి ఎస్సీ హక్కులు ఉండవని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కోర్టు పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. రాజ్యాంగ ఉత్తర్వు 1950 రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు (1950) ప్రకారం.. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని పేర్కొంది.
ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన తక్షణమే వారి ఎస్సీ హోదా రద్దవుతుంది. తద్వారా వారు ఎస్సీ రిజర్వేషన్లు లేదా ఎస్సీ/ఎస్టీ చట్టం కింద లభించే రక్షణలను క్లెయిమ్ చేయలేరని పేర్కొంది.
ఈ విషయమై ఎపి హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధంగా ఉందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పు ద్వారా మతమార్పిడి చేసుకున్న వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ల విషయంలో ఉన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది.