* రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక.
* రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం...
* ఈ యేడాది మార్చి నుంచే మండుతున్న భానుడు...
విశాఖ :
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపింది. ఇందులోనూ ఏయే మండలాల్లో ఈ ప్రభావం ఉంటుందో కూడా వివరాలను వెల్లడించింది. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలోనూ వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా రాయలసీమ జిల్లాలోను 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.
శుక్రవారం వడగాల్పులు వీచే మండలాలు 32 కాగా,శనివారం వడగాల్పులు వీచే మండలాల సంఖ్య 90గా నమోదైంది. అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచిస్తోంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. మంచి నీరు, మజ్జిగ, ORS ఎక్కువగా తాగాలని సూచిస్తోంది.

మార్చి, ఏప్రిల్, మే లో తీవ్రతరం.. :
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే నెలలతో పాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని...దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది. మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని, అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కవ రోజులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇది వరకే వెల్లడించింది.