Astra web desk :
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వేదికగా మారింది. రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై కీలక తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలనే ఉద్దేశంతో ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు.
ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. సభ ఆమోదం పొందిన అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇక సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు స్థిరమైన రాజధాని నిర్మాణం అత్యంత అవసరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ లక్ష్యంతో కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి విధానాలు మారకూడదని, రాష్ట్ర అభివృద్ధికి స్థిరత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఈ ప్రత్యేక సమావేశానికి ప్రతిపక్ష వైసీపీ మాత్రం హజరుకాలేదు. ఈ సమావేశ ప్రస్తావన వచ్చిన వెంటనే వైసీపీ స్పందిస్తూ...తాము అమరావతికి వ్యతిరేకం కాదని, తమ వికేంద్రీకరణలోను అమరావతికి ప్రత్యేక స్థానం ఇచ్చామని, అసెంబ్లీతో పాటు మండలిని కూడా సమావేశ పరచాలని డిమాండ్ చేశారు.