అమరావతి, మార్చి 28 :
ఏపీకి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి తీర్మానం సందర్బంగా అయన మాట్లాడుతూ చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. తెలంగాణ వేరు.. ఏపీ వేరు అనే భావన మాకెప్పుడూ లేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదు. రాజధాని లేని రాష్ట్రంగా మనం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. ఏపీ నేలపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా టీడీపీతో కలిశాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కూటమిగా ఏర్పడ్డాం.
సాధారణంగా భూసేకరణ అంటే ఎన్నో గొడవలు, అడ్డంకులు ఉంటాయని, కానీ అమరావతి కోసం రైతులు ఎటువంటి గొడవలు లేకుండా స్వచ్ఛందంగా భూములివ్వడం ఒక గొప్ప విషయమని పవన్ పేర్కొన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన వారందరికీ న్యాయం చేసేలా అప్పట్లోనే అడుగులు పడ్డాయని ఆయన వివరించారు.
2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై అభాండాలు వేశారని, రాజధాని మహిళా రైతులను రోడ్లపై దారుణంగా కొట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఇల్లు వదిలి బయటకు రాని ఆడవాళ్లు సైతం రాజధాని కోసం రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. గత పాలనలో చట్టసభల్లో దాడులు జరిగాయని, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకే రక్షణ లేని 'యుద్ధ వాతావరణం' ఉండేదని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, దాని వల్లే ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్ విమర్శించారు. "తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు అనే భావన మాకు ఎప్పుడూ లేదు.. మా దృష్టిలో తెలుగు నేల ఒక్కటే" అని ఆయన ప్రకటించారు. అమరావతికి కల్పిస్తున్న ఈ చట్టబద్ధత భవిష్యత్తు తరాలకు ఒక భరోసా అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా అరాచకమే. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే మహిళలు భయపడేవారు. ప్రశ్నించిన అందరిపైనా దాడులు చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.