* 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె సుగాలి ప్రీతిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య ..
*తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన ...
* తిరిగి సీబీఐ విచారణ పునరుద్ధరించేలా న్యాయ సహాయం అందించాలని వైయస్ జగన్ కు వినతి...
తాడేపల్లి :
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్‌లు కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె సుగాలి ప్రీతిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్ జగన్‌కు వివరించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని, అంతేకాక తమ కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని ప్రీతి తల్లిదండ్రులు గుర్తుచేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కనపెట్టిందని, సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని తెలిపారు. తిరిగి సీబీఐ విచారణ పునరుద్ధరించేలా న్యాయ సహాయం అందించాలని వైయస్ జగన్‌ను కోరారు. అంతేకాక బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో పెన్షన్ ఇవ్వడం లేదని స్థానిక అధికారులు తమకు చెప్పారని ప్రీతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని పలుమార్లు కోరినా చంద్రబాబు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని వారు వైయస్ జగన్ ఎదుట వాపోయారు. ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్న వైయస్ జగన్ వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రీతి కుటుంబానికి అందించిన సహాయాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
డిప్యూటి సిఎం పవన్ ఘాటు వ్యాఖ్యలు... :
సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఈ కేసు గురించి అసలు పట్టించుకోలేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటం చేసి కలిస్తే ఈ కేసులో ఇక ఏమీ చేయలేనన్నారని, కేసులోని నిందితులంతా టీడీపీ వారే కావడం వల్ల ఆ వివరాలు కూడా పవన్ కు చెప్పామని, కానీ ఈ కేసులో విచారించాల్సిందేమీ లేదన్నారని అన్నారు. జగన్ హయాంలో వేసిన సీబిఐ విచారణను కూడా జరగనివ్వలేదని, ఆడపిల్లకు అన్యాయం జరిగితే మీరు చేసే న్యాయం ఇదేనా పవన్? అంటూ ప్రశ్నించారు.