KADAPA MP YS AVINASH REDDY HOT COMMENTS ON B.Tech RAVI :
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YSRCP) మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై, స్థానిక టీడీపీ నేత బీటెక్ రవిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి అధికారపక్షం పాత అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ. 24 వేలు ఖర్చు చేయడం దండగని, ఆ నిధులు మెడికల్ కాలేజీలకు కేటాయిస్తే బాగుంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారని తెలిపారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ పై రూ. 33 టాక్స్ తగ్గిస్తామని చెప్పి, నేడు ఆ మాట తప్పారని మండిపడ్డారు. అయితే, ప్రజలకు సంబంధించిన ఈ అంశాలకు సమాధానం చెప్పలేక, గత వారం రోజులుగా కూటమి ప్రభుత్వం 'గొడ్డలి పార్టీ' అంటూ పాత క్రిమినల్ అంశాలను లాగి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అవినాష్ రెడ్డి మండిపడ్డారు.
బీటెక్ రవి వ్యాఖ్యలకు కౌంటర్ ... :
'జగన్ అనుకుంటే నేను అరగంట కూడా బ్రతరలేను' అని గతంలో బీటెక్ రవి స్వయంగా అన్నారని, జగన్ గారికి అలాంటి ఆలోచనలు లేకపోయినా ఇప్పుడు కొందరు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. గతంలో ఎంపీటిని పదవి కోసం, ఎన్నికల తర్వాత వైసిపిలో చేరుతాననే ప్రతిపాదనతోనే బీటెక్ రవి తన ఉలిమెల్ల తోటకు రాయభారానికి వచ్చారని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే తన పదవిని అమ్ముకోవడానికి విజయసాయిరెడ్డిని కూడా కలిశారన్నారు. ఇవన్నీ అయన చేసిన అరోపణలకు సమాధానాలే గానీ ... ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయన్నారు. తాము శాంతియుత రాజకీయాలను నమ్ముతామని, ప్రజా సమస్యలపై గంటల తరబడి మాట్లాడినా ప్రతిపక్ష నాయకులు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా బీటెక్ రవి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.
బైరటీస్ అక్రమ విక్రయాల ఆరోపణలు ... :
తమ కుటుంబానికి 1950ల నుంచే క్లాస్ వన్ కాంట్రాక్టర్ చరిత్ర ఉండన్న ఎంపీ, ప్రజల సొమ్మును తాము దోచుకోలేదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న 'టిఫిన్ బైరటీస్'కు చెందిన రూ. 9 కోట్ల విలువైన 3 టన్నుల ముగ్గురాయిని బీటెక్ రవి రాత్రికి రాత్రి అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. ఇంత పెద్ద దోపిడీ జరిగినా పులివెందుల పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదని, భవిష్యత్తులో దీనిపై చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో జరిగిన గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ బీటెక్ రవే తమ వద్దకు వచ్చి సహకారం కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తమ కుటుంబం 1952 నుంచే కాంట్రాక్టింగ్ రంగంలో ఉందని, వైఎస్సార్ ముఖ్యమంత్రి కావడానికి ముందే ఆస్తులు సంపాదించుకున్నామని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్, ఇసుక రవాణాపై కూడా ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను రాత్రికి రాత్రే లారీల ద్వారా తరలించారని, లారీ నంబర్లతో సహా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కుమార్ కాల్వ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలింపులు జరిగాయని, దీనిపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. పులివెందులలో జూదం, జిలెటిన్ స్టిక్స్ అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోందని, వాటి కారణంగా ప్రాణ నష్టాలు కూడా సంభవించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపల్లికి చెందిన రామచంద్ర మైన్‌లో మృతి చెందిన ఘటనను కూడా ప్రస్తావిస్తూ అధికారులు స్పందించలేదని విమర్శించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ అరోపణలపై బీటెక్ రవికి ఎంపీ అవినాశ్ సవాల్ .. :
తమపై టీడీపీ నేత బీటెక్ రవి చేస్తున్న ఆరోపణలను ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలపై తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, బీటెక్ రవి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. తన తండ్రి గత మూడేళ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నారని, ప్రతి విషయానికి ఆయనపై బురద జల్లడం తగదన్నారు.
మనస్సా, వాచా మనస్పూర్తిగా..వైఎస్ వివేకం పెద్దనాన్న గెలుపు కోసం కృషి చేశా .. :
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గెలుపు కోసం తాను మనస్సా, వాచా మనస్పూర్తిగా, పూర్తి చిత్తశుద్ధితో పనిచేశానని, అవసరమైతే ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. మైనింగ్, ఇసుక రవాణా, వివేకా కేసు, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై కూడా తాను నిర్దోషినేనని చెప్పారు.
బిటెక్ రవిపై వ్యంగ్య వ్యాఖ్యలు ... :
బీటెక్ రవిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన అవినాష్ రెడ్డి, ప్రజలకు బీటెక్ అంటే “బాత్రూమ్ టెక్నీషియన్ రవి”గానే తెలుసన్నారు. బాత్ రూంల వద్ద కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పుకునే అయన లాంటి అలవాటు తమకు లేదని, పార్టీ కోసం పనిచేసే వారిని చెంచాలు అని అభివర్ణించడం సరైంది కాదన్నారు.
జగన్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకే అరోపణలు... :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ రాజారెడ్డిని టీడీపీ నేతలు విమర్శించడం తగదని MP వైఎస్ అవినాశ్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి దగ్గర నుండి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ రాజారెడ్డిని విమర్శించారన్నారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి జగన్ రాజకీయ విషయాలు గురించి మాట్లాడితే ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వలేదన్నారు.