Saturday, 13 June 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

సంక్షోభాల్లోనే పొదుపు గుర్తుకు వస్తుందా .. ?

09 Jun 2026
10:31 PM
145

*ఆర్ధిక వ్యవస్థ కోలుకోవాలంటే ...
*పొదుపు ఒక్కటే తారక మంత్రం కాదు...
* తాజా చర్యలతో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్బరం....
* ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య విశ్లేషణ ...

Astra desk :

దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పొదుపు విధానాలను టిడిపి ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తప్పపట్టారు. ఆర్ధిక వ్యవస్థ కోలుకోవాలంటే ...పొదుపు ఒక్కటే తారక మంత్రం కాదని...తాజా చర్యలతో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్బరంగా మారిందంటూ తాజాగా విడుదల చేసిన తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రం విధానాలను తనదైవ శైలీలో తప్పులు ఎత్తి చూపిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఇప్పుడు మరోమారు ప్రస్తుత తాజా అంశమైన పొదుపు సూత్రాలపై కూడా స్పందించారు. ప్రస్తుతం కేంద్రం సూచించిన పొదుపు సూత్రాలపై ఎమ్మెల్సీ రామచంద్రయ్య విశ్లేషణ ఒక సారి చూస్తే.....


* దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల దేశ ప్రజలను పొదుపు చర్యల్ని పాటించమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో పొదుపు చర్యలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తో సహా మరికొన్ని రాష్ట్రాలు ప్రధాని సూచనను శిరసావహిస్తూ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రధాని మోదీ మే 10న హైదరాబాదులో జరిగిన ఓ సభలో పాల్గొన్న సందర్భంగా ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకోవాలని పిలుపునిస్తూనే... విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి బంగారం కొనుగోళ్ళను వాయిదా వేసుకోవాలని కూడా చెప్పారు.

* దేశ ప్రజల్ని పొదుపు పాటించమని పాలకులు పిలుపునివ్వడం మన దేశంలో ఇదే ప్రథమం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చిక్కుల్లో పడినా, ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చినా అప్పటికప్పుడు పొదుపు చర్యల వైపు పరుగులు పెట్టడం మనకు అలవాటే! ప్రజలు, ప్రభుత్వాలు పొదుపు పాటించడం మంచిదే! అయితే పొదుపు అన్నది మన జీవితంలో ఓ అంతర్భాగం కావాలని గాంధీజీ ఏనాడో చెప్పారు. కానీ వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఎదురయినపుడే పొదుపు గుర్తుకు రావడం, మిగతా సమయాల్లో దుబారా చేయడం భారతీయులకు అలవాటైపోయింది. కనీసం గతం నుంచి గుణపాఠం నేర్చుకోలేకపోవడం మన సమాజంలో ఉన్న బలహీనత. వనరులను పొదుపుగా వాడడం ఓ కళ. ఇది అలవాటుగా చేసుకోవడం అన్నది ఆర్థిక క్రమశిక్షణ పాటించడం క్రిందకు వస్తుంది. అది మంచినీళ్ళు కావచ్చు, పెట్రోల్ విద్యుత్ మొదలైన వనరులు ఏవైనా కావచ్చు. ఉదారంగా వచ్చినా అవసరమైన మేరకు వాడటం అన్నది బాధ్యతాయుతమైన ప్రవర్తన క్రిందకు వస్తుంది. ప్రభుత్వంలో ఎవరున్నా... ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలన్నది పరిపాలనలోని ప్రధాన సూత్రం. పాలకులు గనుక పొదుపును పాటిస్తే ప్రజలు క్రమంగానైనా ఆ దారిలోకి వస్తారు.

* లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా 1965లో దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకొని దేశ ప్రజలను వారంలో ఓ పూట పస్తు ఉండమని చెప్పిన అంశాన్ని ఇప్పుడు చాలామంది గుర్తు చేస్తున్నారు. నిజానికి గాంధీజీ ప్రజలను వీలైనప్పుడల్లా ఉపవాసం చేయమనేవారు. దీనివల్ల దేహప్రక్షాళన జరుగుతుందని అనేవారు. అంతేకాదు... మితిమీరిన మోతాదులో ఆహారం తినడం కూడా హింసలో ఓ భాగం అని చెప్పారు. ఆకలి తీరినా ఇంకా తినడం అంటే... మన దేహం పై మనం చేసుకునే దాడి అని అన్నారు గాంధీజీ!

* ఇక దేశంలో వినిమయ సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిన తర్వాత దేశ ప్రజల్లోని అత్యధికులు అంతకు ముందులా కొద్దిగా పాడైన వస్తువులను బాగు చేయించుకొని తిరిగి వాడటం లేదు. పాతవి పడేసి కొత్తవి కొంటున్నారు. ఉదాహరణకు గతంలో ప్రజలు తాము ధరించే చెప్పులు పాడైతే వాటిని కుట్టించుకొని మరికొంత కాలం వాడేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా ఆ పరిస్థితి లేదు. వినిమయ సంస్కృతి పెరగడం వల్ల, అన్ని రకాల ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దానివల్ల, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగిన మాట నిజమేగానీ, ప్రజల్లో పొదుపు పట్ల అవగాహన పూర్తిగా లోపించింది. ఆ దిశగా ప్రభుత్వాలు సైతం ప్రజల్ని చైతన్యవంతం చేయడం లేదు.

* ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు మాత్రమే పొదుపు మంత్రం జపించడం మిగతా సమయంలో దానిపై దృష్టి పెట్టకపోవడం ఏ ఆర్థిక వ్యవస్థకూ మేలు చేయదు. నిజానికి నేడు ప్రపంచంలో భారత్ తో సహా మెజార్టీ దేశాలు బడ్జెట్ లోటుతోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ రాబడి కంటే ఖర్చులు పెరిగిపోయినప్పుడు బడ్జెట్ లో లోటు ఏర్పడుతుంది. ఆ లోటును భర్తీ చేయడానికి పన్నులు పెంచడం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో కోత పెట్టడం అనివార్యం. అయితే అధికారంలో ఉండేవారు నిరంతరం రాబోయే ఎన్నికలలో ఎలా గెలవాల అనే అంశంపైనే దృష్టి పెడతారు. కనుక ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందనే భయంతో నిర్ణయాలను వాయిదా వేస్తుంటారు. ఆ క్రమంలోనే లోటు బడ్జెట్ ను కొనసాగిస్తూనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ప్రతియేటా అప్పులు మీద అప్పులు చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆర్థిక సంక్షోభమే. కానీ, ఈ నిజాన్ని ఏ ప్రభుత్వమూ బహిరంగంగా చెప్పదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చే ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు తదితర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అప్పు ఇవ్వడానికి కొన్ని అంక్షలు విధిస్తున్నాయి. 1998 నుంచి దాదాపు 4 ఏళ్ల పాటు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న అర్జెంటీనాను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఐ.ఎం.ఎఫ్ ఆ దేశానికి అనేక షరతులు విధించింది. అందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత, పెన్షన్ దారులకు పెన్షన్ లో కోత మొదలుకొని పలు సంక్షేమ కార్యక్రమాలకు కత్తెర వేయాలన్న నిబంధనలు ఉన్నాయి. అప్పు స్వీకరించే వారి క్రెడిట్ వడ్డీనెస్ (అప్పు తిరిగి చెల్లించే స్తోమత) ను చూసి మాత్రమే అప్పు ఇస్తామని లేదంటే ఒక్క పైసా కూడా రాల్చేది లేదని తేల్చి చెప్పింది. అర్జెంటీనా, తర్వాత ఐర్లాండ్, పోర్చుగల్, తుర్కియే తదితర దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు సైతం ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థలు ఆ దేశాల ఆర్థిక విధానాలను ప్రభావితం చేశాయి. వాటినే బెల్ట్ టైటనింగ్ పాలసీలుగా పిలవడం మొదలుపెట్టారు.

* 1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్రధాని పి.వి. నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపాయి విలువ తగ్గించారు. లైసెన్స్ రాజ్ ను రద్దు చేశారు. పరిశ్రమలు, వ్యాపారాలలో ప్రభుత్వ జోక్యం తగ్గినప్పుడు అవి ఉత్తమంగా పనిచేస్తాయన్న లైసెజ్- ఫెయిర్ (Laissez-faire) మార్గాన్ని అనుసరించారు. ఫలితంగానే రెండేళ్ళ వ్యవధిలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కోలుకోగలిగింది. ఉదార ఆర్థిక విధానాలు అమలు చేయడం వలన దేశంలో సంపద పెరిగింది. అదే సమయంలో వినిమయ సంస్కృతి విస్తరించింది. మూలధనాన్ని కూడ బెట్టడం కంటే విలాస వస్తువుల వినియోగం పట్ల ప్రజల్లో మోజు పెరిగిపోయింది. తమ హోదాను ప్రదర్శించుకొనేందుకు మధ్యతరగతి ప్రజలు సైతం విలాస వస్తువుల్ని కొనుగోలు చేయడం దేశంలో ఎక్కువైంది. ఫలితంగానే దేశంలో సంపన్నులు మొదలుకొని మధ్యతరగతి ప్రజానీకం వరకు బంగారు ఆభరణాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. బంగారాన్ని అటు పెట్టుబడి గాను, ఇటు విలాస వస్తువుగాను పరిగణించడం వల్లనే పెద్ద ఎత్తున బంగారానికి డిమాండ్ పెరిగింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యం లోనే సమాజంలో నిరాడంబరత, పొదుపు అనే వాటికి స్థానం లేకుండా పోయింది.

* ప్రజలు పొదుపు పాటించడం వల్ల ఒనగూర్ ప్రయోజనాలను పరిశీలిస్తే... ముడి చమురు, బంగారం కొనుగోళ్ళకు వినియోగించే విదేశీ మారకద్రవ్యం పరిణామం తగ్గుతుంది. అయేతే, దానివల్ల అనేక రంగాలలో డిమాండ్ తగ్గుతుంది. వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడం నిలిచిపోతుంది. అలాగే వస్తు వినిమయం పడిపోతుంది. ఫలితంగా దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్షీణిస్తాయి. పొదుపు వల్ల ఫిస్కల్ కన్సాలిడేషన్ (ద్రవ్య లోటు నియంత్రణ) జరగదు. దేశంలోని వాస్తవ ఆర్ధిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయాలు జరిగినపుడే ఆశించిన ఫలితాలు అందుతాయి. ఈ నిజాన్ని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పాల్ క్రూగ్ మెన్ పలు సందర్భాల్లో నొక్కి చెప్పాడు. ఐ. ఎం. ఎస్ కూడా దీనిని చాలా వరకు అంగీకరించింది.

* ప్రధాని పొదుపు పిలుపు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఎంత డబ్బు ఆదా అయిందో ఇప్పటికిప్పుడు లెక్కలు బయటకు రావు. కానీ, ఆ పిలుపుతో పాటు పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల, బంగారంపై తాజాగా విధించిన అదనపు పన్నులు వగైరా చర్యల వల్ల పేద, మధ్యతరగతి వర్గాల వారి జీవనం దుర్భరం అయిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఎనిమిది కీలక రంగాలలోని పరిశ్రమలలో సాలీనా 7శాతం అభివృద్ధి కనబడాల్సి ఉండగా అది కేవలం 1.7 శాతానికి పరిమితమయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి పొదుపు ఒక్కటే తారక మంత్రం కాదని అనుభవంలో అందరికీ అర్థమౌతోంది.

సి. రామచంద్రయ్య, శాసనమండలి సభ్యులు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (2)

N
N venugopal • 10 Jun, 2026

అర్జెంటీనా, ఐర్లాండ్ అనుభవాలు — గుణపాఠాలు
పెట్రో ధరలు పెంచడం + బంగారుపై పన్ను = నేరుగా సామాన్యుడిపై దెబ్బ
సంపన్నులు పొదుపు చేయగలరు — పేదలకు పొదుపు చేసే స్తోమతే లేదు
గాంధీజీ చెప్పినట్టు పొదుపు జీవితశైలిలో భాగం కావాలి
కేవలం emergency గా కాదు, నిరంతర అలవాటుగా ఉండాలి

N
N venugopal • 10 Jun, 2026

అర్జెంటీనా, ఐర్లాండ్ అనుభవాలు — గుణపాఠాలు
పెట్రో ధరలు పెంచడం + బంగారుపై పన్ను = నేరుగా సామాన్యుడిపై దెబ్బ
సంపన్నులు పొదుపు చేయగలరు — పేదలకు పొదుపు చేసే స్తోమతే లేదు
గాంధీజీ చెప్పినట్టు పొదుపు జీవితశైలిలో భాగం కావాలి
కేవలం emergency గా కాదు, నిరంతర అలవాటుగా ఉండాలి