* దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాల్సిందే...
* కడపలో వైసీపీ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం...
* తీర్పు పునఃసమీక్ష కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డులు..
కడప :
మతం మారితే అసమానాతలు తొలగిపోతాయా ... ? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాల్సిందే అంటూ కడపలో వైసీపీ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. వైసీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటి సిఎం అంజాద్ బాష, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ మతం మారితే అసమానాతలు తొలగిపోవని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాల్సిందేనన్నారు. జైన్స్, సిక్కులు, బౌద్దులు చర్చికి పోయినా కులం మారదని, కేవలం దళితులకు మాత్రమే కులం మార్చాలనడం తగదన్నారు. గతంలో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి, గత ప్రభుత్వంలోను అప్పటి సిఎం వైఎస్ జగన్ లు కూడా తీవ్రంగా వ్యతిరేకించారన్నారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. కనీసం రివ్యూ పిటిషన్ వెయ్యడం కూడా మర్చిపోయిందని, సుప్రీం కోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పుపై జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవ సోదరులలో తీవ్రమైన ఆందోళన నెలకొందన్నారు. ఈ తీర్పును గౌరవ సుప్రీం కోర్టు మరోసారి పునఃసమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మా పార్టీ బలంగా నమ్ముతోందన్నారు. భారత రాజ్యాంగం మనకు కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్ 14), వివక్ష నిరసన హక్కు (ఆర్టికల్ 15), మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25) లకు విరుద్ధంగా ఈ నిర్ణయం ఉందనేది తమ అభిప్రాయమని, కేవలం మత మార్పిడి జరిగినంత మాత్రాన, శతాబ్దాలుగా సమాజంలో ఆ వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక వెనుకబాటుతనం, వివక్ష రాత్రికి రాత్రే తొలగిపోవన్నారు. ఒక వ్యక్తి దళిత క్రైస్తవుడిగా మారినప్పటికీ, సమాజంలో వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు అలాగే ఉన్నాయని, వారికి ఎస్సీ హోదాను నిరాకరించడం వల్ల వారు రాజ్యాంగబద్ధంగా పొందాల్సిన ఎన్నో ఫలాలను, హక్కులను కోల్పోవలసి వస్తుందన్నారు. అందుకే కడపలో వినూత్నంగా పోస్టు కార్డు ఉద్యమాన్ని చెయ్యాలని ప్రారంభించామని, త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్యమం ద్వారా దళితులకు అన్యాయం జరగకుండా న్యాయం చెయ్యాలని కోరడం జరుగుతుందని, తక్షణం కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ మెడలు వంచైనా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధిస్తామన్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బూసిపాటి కిషోర్ మాట్లాడుతూ "యావత్ భారతదేశంలో దళిత వర్గాలకు సంబంధించిన 26 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానం, సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సమంజసం కాదన్నారు. మీరు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించి ఫోర్-మెన్ కమిటీ గానీ, సెవెన్-మెన్ కమిటీ గానీ, నైన్-మెన్ జడ్జీలతో కూడుకున్నటువంటి బెంచ్‌లతో తీర్పు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క తీర్పు సరైనటువంటిది కాదు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు అని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమందరం కూడా పోస్ట్‌కార్డ్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, తీర్పు ఇచ్చన సుప్రీంకోర్టు జస్టిస్‌కు ఈ పోస్ట్‌కార్డ్ ల ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతోందన్నారు. ఈ యొక్క తీర్పును తప్పక పునఃపరిశీలించాలని, ఈ యొక్క తీర్పు దళిత వర్గాలకు సంబంధించి భారతదేశం మొత్తం 26 కోట్ల మంది దళిత వర్గాల జీవన విధానాన్ని దెబ్బతీసే కార్యక్రమలా ఉందన్నారు. దీనిమీద పునఃపరిశీలించాలనేటటువంటి ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో ఈ ఉద్యమం కడప నుంచి మొదలవుతోందన్నారు.