నెక్ట్స్ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి.. !!
వైసీపీ మ్యానిఫెస్టోలో తొలి అంశం ఖరారు...
మంగళగిరి :
వైసిపి అధినేత వైఎస్ జగన్ మరో మారుతున్న ధైర్యాన్ని చాటుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేసింది మొదలు తొలిసారి ఎంపీగా మినహా ....నా తండ్రి మరణం తర్వాత ప్రతి సందర్భం వైఎస్ జగన్ ధైర్య సాహసోపేతాలను పరీక్షిస్తూనే ఆయన రాజకీయాలు కొనసాగాయి. కానీ ఎక్కడా సమస్యకు వెన్ను చూపని వైఎస్ జగన్ ... ఇప్పుడు కూడా అలాంటి ధైర్యసాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ పాలనలో వ్యవహరించిన తీరుతో 11 సీట్లకు పరిమితమైందని ఓ వైపు విమర్శలు వినిపిస్తున్నా..... ఇప్పుడు కూడా వైఎస్ జగన్ తాను కొత్తగా తెరపైకి తెచ్చిన " మావిగన"కు కట్టుబడి ఉన్నానని... రానున్న ఎన్నికల్లో "మావిగన్ వర్సెస్ అమరావతి" తోనే ఎన్నికలకు వెళ్తామని ....మావిగన్ అంశాన్ని తమ మేనిఫెస్టోలో కూడా పెడతామని మొక్కవోని ధైర్యంతో ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడిదే ఎపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అసలే అధికారం కోల్పోయిన వైఎస్ జగన్ ఈ సారైనా అచితుచి అడుగేస్తారని.... మావిగన్ పేరు తెరపైకి తెచ్చినా అమరావతి విషయంలో పంతానికి పోరని అనుకున్నారు. కానీ ఇంకా ఎన్నికలకు మూడేళ్లున్నా .... వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి’ అంటూ జగన్ ప్రకటించారు. మావిగన్‌కు మేం కట్టుబడి ఉన్నాం. మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందాం. మావిగన్ మా నినాదం.. మాకు మద్దతు ఇచ్చేవాళ్లు ఓటేస్తారు. ఎన్నికల్లో అమరావతా.. మావిగనా.. ప్రజలే తేల్చాలని సంచలన ప్రకటన చేశారు. మొత్తానికి, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే…ఆ ఎన్నికల్లో తమ అజెండా ఇదేనంటూ వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
అమరావతికి వ్యతిరేకం కాదన్న అయన....అవినీతి రహిత రాజధాని నిర్మాణమే తమ నినాదమన్న జగన్.. ఈ కారణంగానే తాము అమరావతిని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మావిగన్ ను రాజధానిగా పరిగణిస్తే.. ఎలాంటి అవినీతి లేకుండానే రాజధాని నిర్మాణాన్ని చేపట్టవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. మావిగన్ లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్న జగన్… మావిగన్ ను రాజధానిగా అభివృద్ది చేయాలంటే పెద్దగా నిధులు కూడా అవసరం లేదని, ఈ కారణంగానే తాము మావిగన్ ను ప్రతిపాదించామన్నారు. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, గుంటూరులో వివిధ విద్యా సంస్థలు ఉన్నాయని, ఓ రాజధానికి ఇంతకంటే ఏం కావాలని కూడా ఆయన ప్రశ్నించారు.
ఇక మావిగన్ ఎజెండాతోనే తాము వచ్చే ఎన్నికలకు వెళతామన్న జగన్.. తమ నినాదం నచ్చివవారే వైసీపీకి ఓటేస్తారని ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అదే సమయంలో అమరావతికి మద్దతు ఇచ్చేవారంతా కూటమి పార్టీలకు ఓటేస్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహాలో ఓటింగ్ జరిగినా..తమకేమీ ఇబ్బంది లేదన్న ధీమాను జగన్ వ్యక్తపరిచారు. ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి ప్రాతిపదికనే ఎన్నికలు జరగనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. తాను రైతుల పక్షపాతిగా చెప్పుకున్న జగన్.. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. అలాంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తనకు లేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తంగా మావిగన్ వర్సెస్ అమరావతి పేరిట జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకే తెర లేపాయి.