DELHI :
అయోధ్య విరాళాల చోరీపై పూర్తి నివేదిక ఇవ్వాలని సిట్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నుండి సుప్రీంకోర్టు సోమవారం తాజా నివేదికను కోరింది. ఆలయ విరాళాలలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు, ఫోరెన్సిక్ మరియు సీఏజీ (CAG) ఆడిట్ జరిపించాలని దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణలోకి తీసుకుంది. ఈ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించనున్నట్లు తెలిపింది. దర్యాప్తు బృందం కూర్పుతో పాటు పురోగతి వివరాలను తెలియజేసే నివేదికను సమర్పించాలని, యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ని కోర్టు ఆదేశించింది.
విరాళాల అక్రమాలపై సిట్ ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను, సిట్ కూర్పును స్పష్టం చేస్తూ తదుపరి సోమవారం లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆలయ లెక్కింపు గదిలో జరిగిన పలు చోరీలు, భద్రతా లోపాలు, అనుమానాస్పద ఘటనలను సిట్ అధికారులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. అయితే ఈ అయోధ్య రామాలయ విరాళల వివాదం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ సభ్యులు ఎవరో మాకు తెలియాలి. వారు ఇప్పటి వరకు సేకరించిన వివరాలతో నివేదిక ఫైల్ చేయండి. ఆ నివేదికను చూసిన తర్వాతే ఈ కేసులో సీబీఐ లేదా ఇతర సంస్థలతో విచారణ అవసరమా కాదా అనే దానిపై మేము అదనపు ఆదేశాలు ఇస్తామని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ వివాదంపై తమ వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై యూపీ పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సిట్ విచారణ ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని కోర్టుకు వివరించారు.