* మంత్రి ప్రధాన్ రాజీనామా చేసే వరకువెనక్కు తగ్గేది లేదన్న ఆందోళనకారులు...
* ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు ....
ఢిల్లీ :
NEET పేపర్ లీక్ వ్యవహారం దేశ మొత్తం ఆందోళనలు...నిరసనలతో అట్టుడుకుతున్న వేళ... కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారికి త్వరితగతిన, అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చూడటానికి 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులను' ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్ లో ప్రధాని మోడి పోస్టు చేశారు. పరీక్లల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
గడచిన నాలుగు రోజులుగా ఆందోళనలు, నిరసనలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ....ప్రధాని మోడి ఇవాళ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ... విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. 'మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే.. ఏదీ ముఖ్యం కాదని, పేపర్ లీకేజీల్లో ప్రమేయం ఉన్నవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు మేము తీసుకుంటున్న వరుస చర్యల్లో ఇది భాగం. యువత భవిష్యత్తును దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిని వదిలిపెట్టేది లేదు' అని ప్రధాని చెప్పారు.
మరో వైపు, ఈ వ్యవహారంపై ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలను తీవ్రతరం చేశాయి. 'చలో సంసద్' పిలుపుతో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. తమ ఆందోళనను విరమించాలంటే ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు ఆర్గనైజేషన్ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రధాని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినా... ఆందోళనకారులు మాత్రం తాముపెట్టిన కండిషన్స్ విషయంలో తగ్గేదిలేదంటూ తెగేసి చెబుతున్నారు.
1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని, ఈ విషయంలో రాజీపడేదే లేదని, ఈ డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
2. పేపర్ లీక్ వ్యవహారం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలి.
3. నీట్ పీపర్ లీక్ పై ప్రశాంతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి కేసులు పెట్టబోమని ప్రభుత్వం నుంచి హామీ కావాలని డిమాండ్ చేశారు.
అయితే వీటిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ... పేపర్ లీకేజీల అంశాన్ని రాజకీయం చేయకూడదని, ఇది చాలా తీవ్రమైన సమస్య కాబట్టి లోతైన చర్చ అవసరమని పేర్కొన్నారు.
శాంతియుత నిరసనలకు పిలుపు .. :
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో మాట్లాడినట్లు సౌరవ్ దాస్ తెలిపారు. నిరసనల వంకతో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి ఆందోళనలను దారి మళ్లించే ప్రమాదం ఉందని, కాబట్టి విద్యార్థులంతా శాంతియుతంగానే నిరసనలు తెలపాలని వాంగ్‌చుక్ విజ్ఞప్తి చేశారు.
ఇలా ఉండగా, ఢిల్లీలో జరిగిన నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులతో పాటు పలువురు మహిళా పోలీసులు, మొత్తంగా 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే ఈ తోపులాటలో దాదాపు 60 మంది నిరసనకారులు కూడా గాయపడినట్లు సమాచారం.