* విద్యార్థుల వేదనను వినకుండా పిటిషన్‌ను తిరస్కరించడం తీవ్ర విచారకరం..
* బాధితులకు న్యాయం అందించాల్సిన స్థానంలో ఉన్న న్యాయమూర్తులు ..
* ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరం...
* న్యాయ వ్యవస్థపై సామాన్యులకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయ్యడమేనంటూ ఆందోళన...
Delhi :
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని సవాలు చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించడం పెద్ద వివాదానికి దారితీసింది. పిటిషనర్ తరఫున విచారణకు హాజరైన న్యాయవాది, విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడులకు సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, "మా సమయాన్ని వృథా చేయకండి, వీడియోలు చూడటానికి మాకు సమయం లేదు" అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంపై విద్యార్థి లోకం, న్యాయ నిపుణులు, విపక్షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అత్యున్నత న్యాయస్థాన జడ్జిగా ఎందుకు ఉన్నారని ధ్వజమెత్తుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం మీడియాను, పోలీసులనే కాదు న్యాయవ్యవస్థను కొనేసిందని మండిపడుతున్నారు. దేశ భవిష్యత్తు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో అత్యున్నత నాయస్థానం చూపిన ఈ ఉదాసీన వైఖరిపై 'క్రాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ పోలీసులు చేసిన భౌతిక దాడులపై అత్యవసరంగా స్పందించాల్సిన సుప్రీంకోర్టు, విద్యార్థుల వేదనను వినకుండా పిటిషన్‌ను తిరస్కరించడం తీవ్ర విచారకరమని మండిపడ్డాయి. బాధితులకు న్యాయం అందించాల్సిన స్థానంలో ఉన్న న్యాయమూర్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టంపై, న్యాయ వ్యవస్థపై సామాన్యులకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

గతంలో ఇదే జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆవిర్భావం జరిగింది. ఇవాళ తిరిగి విద్యార్ధుల పిటిషన్ విషయంలో సీజేఐ స్పందించిన తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) ఎక్స్ లో ఘాటుగా స్పందించారు. అంతటి ఉన్నత అధికార పదవులలో ఉన్న ఇలాంటి వ్యక్తులు మన ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ వంటివారు అంటూ సీజేఐని ఉద్దేశించి ట్వీట్ చేశారు. మన సుప్రీంకోర్టుకు మరింత గౌరవం అవసరమని సౌరవ్ దాస్ తెలిపారు. ఇంతటి అహంకారం మంచిది కాదని సూర్యకాంత్ గారు గ్రహించాలని కూడా కోరారు. అలాగే భారత ప్రభుత్వం ఆయనకు తగిన సూచనలు చేయాలని సౌరవ్ దాస్ తన ట్వీట్ లో సూచించారు.

దీంతో మరోసారి సుప్రీంకోర్టుకూ, బొద్దింకల పార్టీకీ మధ్య పరిస్ధితి వేడెక్కింది. మరోవైపు విద్యార్థులపై దాడుల వీడియోలు చూసేందుకు టైం లేదంటూ సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మాత్రం సుప్రీంకోర్టులో ఇప్పటికీ కీలక కేసులు పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.