* రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు పోరాటం చేస్తాం..
* పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి ...
* కృతజ్ఞత భావం మా రక్తంలోనే ఉంది ....
* కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు..
వరంగల్ :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న వివాదంపై మాజీ మంత్రి కొండా సురేఖ భర్త, సీనియర్ నాయకుడు కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి పరిస్ధితుల్లోను కాంగ్రెస్ పార్టీని వీడిదేలేదని... కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన కొండా మురళి, కొండా సురేఖలు వారితో చర్చించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పదవులు వస్తుంటాయని, పోతుంటాయని.. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనుచరులతో నిర్వహించిన సమావేశంలో కొండా సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు. తమలో కృతజ్ఞత భావం రక్తంలోనే ఉందని, రాజకీయాల్లో ఎలా బతికామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. తుపాకీ బుల్లెట్లు ఉన్నప్పటికీ తాను ఇంకా బతికే ఉన్నానని కొండా మురళి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా కష్టాల నుంచి వచ్చిన వారేనని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గుర్తించి వారికి టికెట్లు అందిస్తామని కొండా మురళి తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమకు ఉన్న అనుబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెంచుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు, అనుచరులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.