ఏలూరు :
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత ఆళ్ల నాని (Alla Nani) కన్నుమూశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రంలో సేవలందించిన ఆయన ఇవాళ గుండెపోటు కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరులో ఆయన అనుచరులు, రాజకీయ పార్టీల్లో విషాదం నెలకొంది. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న ఆళ్లనాని మరణంతో ఆయన సొంత నియోజకవర్గం ఏలూరులోనూ విషాదఛాయలు నెలకున్నాయి.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యంత అప్తుడిగా కూడా కొనసాగారు. అందువల్లే అయన డిప్యూటి సిఎంగా పనిచేసే అవకాశం దక్కింది. అంతే కాదు కరోనా సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్ల నాని కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆళ్లనాని పూర్తి పేరు కాళీకృష్ణ శ్రీనివాస్. ఏపీ రాజకీయాల్లో వివాదరహితుడిగా, మృదుస్వభావిగా గుర్తింపు పొందారు. రాజకీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే ఆయనకు టీడీపీలో సముచిత స్థానం, సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో స్ధబ్దతగా ఉన్నారు. ఏది ఏమైనా ఆళ్ల నాని మరణవార్త తెలిసి ఆయన అభిమానులు, అనుచరులు,నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.