* గెలిచే చోట్లనే పోటీ... ఎక్కువ ఆశించవద్దనడం ....
* సొంత పార్టీ ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లడమే...
* ఇలాగైతే పార్టీ బలపడెదెప్పుడు....తమకు పదవులొచ్చేదెప్పుడంటూ.....
* సోషియల్ మీడియా వేదికగా మండిపడుతున్నజనసైనికులు.....
విజయవాడ :
జనసేన పార్టీలో మంత్రి నాదేండ్ల మాటలు మంటలు రేపుతున్నాయి. ఎక్కువ సీట్లు ఆశించవద్దు.... గెలిచే చోట మాత్రమే పోటీ చేద్దాం అనడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహవావేశాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఆశించొద్దనడంపై పార్టీ క్యాడర్‌లో చర్చకు దారితీశాయి. ఓ వైపు పార్టీ బలంగా లేదని నాదేండ్లనే చెప్పడమేంటని సొంత పార్టీ క్యాడర్ మండిపడుతుంటే... మరో వైపు జనసేన బలమెంతో సొంతంగా మంత్రి నాదేండ్లనే చెప్పారని... వీడిపోతే ఆ పార్టీకి గెలిచే సత్తా లేదని తేలిపోయిందని ఇతర పార్టీలు ఎత్తిచూపుతున్నాయి. దీంతో ఇప్పుడు సొంత పార్టీలోనే మంత్రి నాదేండ్ల మాటలపై కొత్త చర్చకు తెరలేచింది.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి నాదేండ్ల మాటలు మంటలు రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ ఓటమే లక్ష్యంగా త్యాగాలు చేశాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోను మళ్లీ త్యాగాలు చెయ్యాలా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెరపైకి వచ్చిన సందర్బంలో జనసేనకు 15శాతం, బిజేపికి 5 శాతం సీట్ల కేటాయింపు అంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెరపైకి రావడం....ఇటు జనసేన మంత్రి నాదేండ్ల వ్యాఖ్యలు వైరల్ కావడంతో... జనసేన క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో అప్పట్లో మంత్రి నాదేండ్ల ..సార్వత్రిక ఎన్నికల్లో మనం త్యాగం చేశాం కాబట్టి ఇప్పుడు మనకు ప్రాధాన్యత ఉంటుందంటే సర్దుబాటు చేస్తూ వచ్చారు. అసలే కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా.... పార్టీ పదవులు లేవు.... ప్రభుత్వ పదవులు లేవన్న తీవ్ర నిరాశ...అసంతృప్తిలో ఉన్న క్యాడర్...ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూడా మరోమారు త్యాగాలు చెయ్యాల్సిందేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి నాదేండ్ల చెప్పిన ప్రకారం ... జనసేన సంస్థాగతంగా బలంగా లేకపోవచ్చు, కానీ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కార్యకర్తలు వింటే మన పార్టీ బలంగా తయారవుతుందన్నారు. పార్టీ నాయకత్వం సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. అలాగే కూటమిలో కొనసాగుతున్న క్రమంలో ఎదురయ్యే పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. రాజకీయాల్లో కూటమిగా ముందుకు సాగుతున్నప్పుడు స్థానికంగా చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయభేదాలు తలెత్తడం సహజమని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో నాయకులు సహనం కోల్పోయినా, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రం సంయమనం పాటించాలని సూచించారు.
కానీ ఇప్పుడు సంయమనం ఎమో కానీ.... అధికారంలోకి వస్తే జనసేనకు పెద్దపీఠ వేస్తాయమని చెప్పి.... ఇప్పుడు మరోమారు సర్దుకుపోవాలని చెప్పడం ఎంటంటూ జనసేన క్యాడర్ మండిపడుతుంది. ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచెయ్యాలనుకున్న జనసేన క్యాడర్ అశలపై నీళ్లు చల్లడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనిసమయంలో.... వైసీపీ ప్రభుత్వం హాయంలో టిడిపి క్యాడర్ ఎన్నికలను బహిష్కరించి పక్కకు తప్పుకున్నా.... అన్నింటికి తెగించి పోటీచేసింది జనసేన క్యాడర్ అని, ఆ తెగువను ప్రశంసిస్తూ ఇటీవల పార్టీ అదిష్టానం సైతం వారికి సన్మానం నిర్వహించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరి పార్టీ అధికారంలో లేనిసమయంలో తెగించి పోటీ చేస్తే... ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మనం బలంగా లేమని.,... గెలిచే చోటే పోటీ చెయ్యాలని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. అసలు జనసేన మంత్రిగా ఉంటూ పార్టీ తరుపున మాట్లాడుతున్నావా.... లేక టిడిపికి వత్తాసు పలుకుతున్నావా అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేస్తే పార్టీ బలపడెదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీలో మేయర్, ఛైర్మన్, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చెయ్యాలని తహతహలాడుతున్నారు. కానీ ఎక్కడ కూటమి ... పొద్దు పేరు చెప్పి తమ అశలపై నీళ్లు చల్లుతారోనన్న అనుమానాలతో రగిలిపోతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన క్యాడర్ మొత్తం అయోమయం....అనుమానాలు.... అగ్రహావేశాలతో రగిలిపోతుంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.